తెలుగు రాష్ట్రాల్లో మునుపెన్నడూ లేనట్లుగా తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులపై అణచివేత ధోరణి అనుసరించేందుకు సిద్దమవుతోంది. సమ్మెకు దిగిన ఆర్టీసీ కార్మికులను విధుల్లోంచి తొలగిస్తామని, ఎస్మా చట్టం ప్రయోగిస్తామని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో అసలు ఎస్మా చట్టం అంటే ఏమిటి.. అది అమలు చేస్తే ఏమవుతుందో పాఠకుల కోసం ప్రత్యేకంగా అందిస్తున్నాం.
ఎస్మా అంటే  'ఎసెన్షియల్ సర్వీసెస్ మెయిన్‌టెనెన్స్ యాక్ట్ (అత్యవసర సేవల నిర్వహణ చట్టం). సమ్మెలు, బంద్ లేదా హర్తాళ్ వంటివి చేయడం వల్ల ప్రజల దైనందిన జీవనానికి ఇబ్బంది కలగకుండా చూడడం, కొన్ని రకాల 'అత్యవసర సేవల నిర్వహణ' ఆటంకం లేకుండా కొనసాగేలా చూడడం కోసం ఈ చట్టం రూపొందించారు. 1981లో దీన్ని రూపొందించి చట్ట రూపమిచ్చారు.
ఎప్పుడు ప్రయోగిస్తారు?
అత్యవసర సేవలు అందించే ఉద్యోగులు తమ విధులకు హాజరు కాకుండా, ఆయా సేవలకు విఘాతం కలిగేలా సమ్మె చేస్తే దీన్ని ప్రయోగించే అధికారం ప్రభుత్వాలకు ఉంటుంది.
ఒక్కోసారి ప్రభుత్వ రంగ సంస్థల్లో కార్మికులు తమ డిమాండ్ల పరిష్కారం కోసం సమ్మెబాట పడుతుంటారు. కార్మిక సంఘాలు, యాజమాన్యాలు, ప్రభుత్వాల మధ్య చర్చలు జరిగినా ఫలితం రాకపోవచ్చు. అలాంటప్పుడు కార్మికులు, ఉద్యోగులు సమ్మె చేస్తే సేవలకు అంతరాయం ఏర్పడుతుంది. ఇలాంటి సందర్భాల్లో వారిని దారికి తెచ్చేందుకు ప్రభుత్వాలు 'ఎస్మా' చట్టాన్ని ప్రయోగించే అవకాశం ఉంటుంది. ఈ చట్టాన్ని ఒకసారి ప్రయోగిస్తే ఆరు నెలలపాటు అమల్లో ఉంటుంది. దాన్ని ఒక్కోసారి పొడిగిస్తుంటారు కూడా. ఈ చట్టం ప్రకారం సమ్మె చేస్తున్న ఉద్యోగులపై చర్యలు తీసుకోవచ్చు. సస్పెన్షన్, డిస్మిస్, జైలు శిక్ష, జరిమానా విధించే హక్కు ప్రభుత్వాలకు ఉంటుంది.
చట్టం నేపథ్యం...
1980లో కార్మిక సంఘాల నిరసనలతో దేశం అట్టుడికిపోయింది. ముఖ్యంగా కార్మిక చట్టాల్లో కొన్ని మార్పులు తేవాలన్న ప్రభుత్వ ప్రయత్నాలను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలన్నీ ఉధృతస్థాయిలో ఉద్యమించాయి. 1981లో కార్మిక సంఘాలు పార్లమెంటు ముందు భారీ ఎత్తున నిరసన ప్రదర్శన నిర్వహించాయి. దేశవ్యాప్తంగా పరిశ్రమలన్నింటా పెద్ద ఎత్తున సార్వత్రిక సమ్మె చేయాలని పిలుపునిచ్చారు. క్రమేపీ ఉద్యమం తీవ్రరూపం దాల్చుతున్నట్లు స్పష్టమవడంతో ప్రభుత్వం ముందుగా 12 పరిశ్రమల్లో సమ్మెను నిషేధిస్తూ 'ఎస్మా' ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. తర్వాత ఈ ఆర్డినెన్స్ స్థానంలో 'ఎస్మా' చట్టం తెచ్చారు. జమ్మూ కశ్మీర్‌తోపాటు దేశవ్యాప్తంగా ఇది వర్తిస్తుంది.
చట్టాన్ని అతిక్రమిస్తే ఏమవుతుంది?
ఎస్మా నిబంధనలను అతిక్రమించి సమ్మెకు దిగినట్లు ఎవరిపైనైనా బలమైన అనుమానం ఉంటే, నేరశిక్షాస్మృతితో సంబంధం లేకుండానే పోలీసులు వారంట్ లేకుండానే అరెస్టు చేయవచ్చు. ఎస్మా నిబంధనలకు విరుద్ధంగా సమ్మె ప్రారంభించే, పాటించే ఉద్యోగులను డిస్మిస్ చేయడంతోపాటు వివిధ రకాల క్రమశిక్షణ చర్యలు చేపట్టొచ్చు. సమ్మెలో పాల్గొంటున్న వారికి, వారిని ప్రోత్సహిస్తున్న వారికి జైలు, జరిమానా, లేదా రెండూ విధించవచ్చు. ఈ చట్టం ప్రకారం సమ్మెకు ఆర్థిక సహకారం అందించేవారూ శిక్షలకు అర్హులవుతారు.
గతంలో ఎప్పుడైనా విధించారా?
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమ్మెలపై 'ఎస్మా' ప్రయోగించిన సందర్భాలు అనేకం ఉన్నాయి.
* 2003లో తమిళనాడు ప్రభుత్వ ఉపాధ్యాయులు నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చారు. ఆ సమయంలో జయలలిత ప్రభుత్వం ఎస్మా ప్రయోగించి దాదాపు 1,70,000 మందిని విధుల్లోంచి తొలగించింది. సుదీర్ఘ న్యాయ పోరాటం తర్వాతగానీ వారంతా విధుల్లో చేరలేకపోయారు.
* సమ్మెకు దిగిన వైద్యులు, ఆస్పత్రి సిబ్బందిపై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌తోపాటు దేశ వ్యాప్తంగా చాలా చోట్ల ఎస్మా ప్రయోగించారు.
* 2006లో ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ దేశ వ్యాప్తంగా విమానాశ్రయ సిబ్బంది సమ్మెకు దిగినపుడు ప్రయోగించారు.
* 2009లో ట్రక్కు రవాణా దారులు సమ్మె చేసినపుడు, అదే ఏడాది చమురు, గ్యాస్ సిబ్బంది సమ్మె చేసినపుడు ఎస్మా ప్రయోగించారు.

Axact

Axact

Vestibulum bibendum felis sit amet dolor auctor molestie. In dignissim eget nibh id dapibus. Fusce et suscipit orci. Aliquam sit amet urna lorem. Duis eu imperdiet nunc, non imperdiet libero.

Post A Comment:

0 comments: