భారత్‌లో 63 కోట్ల మందికి పైగా ఇంటర్నెట్ వినియోగదారులు ఉన్నారు. అయినా, దేశంలో ఎంతమంది ఇంటర్నెట్ వాడుతున్నారో, అంతే సంఖ్యలో ఇంటర్నెట్ వినియోగించని వారు ఉన్నారు. ఇంటర్నెట్ వాడని వారిలో అత్యధికం గ్రామీణ ప్రాంతాలలో నివసిస్తున్నవారే.
దేశంలో పెరుగుతున్న డిజిటల్ విభజన గురించి స్మృతీ పర్షీరా రాసిన కథనం ఇది.
భారత డిజిటల్ వినియోగం గురించి ఆసక్తికర విషయాలు దాగి ఉన్నాయి.
ప్రపంచంలో అత్యధిక ఇంటర్నెట్ వినియోగదారులు ఉన్న రెండో దేశం భారత్ (63 కోట్ల మంది). ఈ సంఖ్య అమెరికా, బ్రిటన్, రష్యా, దక్షిణాఫ్రికా దేశాల మొత్తం జనాభా కంటే ఎక్కువే.
ప్రపంచంలో అత్యంత చౌకగా మొబైల్ డేటా లభిస్తున్నది భారత్‌లోనే. దాంతో, గడచిన నాలుగేళ్లలోనే అనేక మంది కొత్తగా ఇంటర్నెట్ వాడకం ప్రారంభించారు.
డేటా వినియోగం భారీగా పెరుగుతోంది. ప్రస్తుతం దేశంలో ఒక్కో ఇంటర్నెట్ వినియోగదారుడు నెలకు సగటున 9 జీబీలకు పైనే డేటా వాడుతున్నారు. అది నెలకు 16 గంటల వీడియోను వీక్షించడంతో సమానం. 2015లో అది 15 నిమిషాలు మాత్రమే.
ఇతర సానుకూల మార్పుల విషయానికొస్తే, ఇ-కామర్స్ మార్కెట్‌లో పోటీ పెరిగిపోయింది. ఆన్‌లైన్ వీడియో ప్రసారాల పరిశ్రమ శరవేగంగా పుంజుకుంటోంది. అందుబాటు ధరల్లో ఫోన్లు దొరుకుతున్నాయి.
దేశంలో డిజిటల్ విభజన
గ్రామీణ జనాభా66%
ఇంటర్నెట్ సాంద్రత25.3%
పట్టణ జనాభా34%
ఇంటర్నెట్ సాంద్రత97.9%
ఆధారం: భారత టెలికం నియంత్రణ ప్రాధికార సంస్థ(ట్రాయ్‌)
ప్రభుత్వ విధాన పరమైన చర్చల్లోనూ డిజిటల్ వినియోగానికి ప్రాధాన్యం పెరిగింది. ఇవన్నీ ఉత్సాహంగానే ఉన్నాయి కానీ, గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్య డిజిటల్ విభజన మాత్రం కొనసాగుతోంది. ఇంటర్నెట్, ఇతర డిజిటల్ టెక్నాలజీని వినియోగిస్తున్న వారికి, వినియోగించని వారికి మధ్య వ్యత్యాసాన్ని ఆ విభజన సూచిస్తుంది.
ఈ విభజనకు రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి ఆయా ప్రాంతాలలో ఇంటర్నెట్ సేవల లభ్యత, రెండోది ఆయా ప్రాంతాలలో ప్రజలు ఇంటర్నెట్ వినియోగించగలరా, లేదా అనేది. అందుకు వారు ఉండే ప్రాంతం, ఆదాయం, జండర్, చదువు, భాష, వయసు... ఇంటర్నెట్ వినియోగాన్ని నిర్వచించే అంశాలలో ఇవి కొన్ని.
భారత టెలికం నియంత్రణ సంస్థ (ట్రాయ్) వెల్లడించిన వివరాల ప్రకారం, దేశంలో ఇంటర్నెట్ వినియోగదారుల సాంద్రత 48.4గా ఉంది. దాని అర్థం, దేశ జనాభాలో ప్రతి 100 మందిలో 48.4 మంది ఇంటర్నెట్ వాడుతున్నారు.
దేశ జనాభాలో 66 శాతం మంది గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నా, అక్కడి ఇంటర్నెట్ వినియోగదారులు 25.3 శాతమే. అదే పట్టణ ప్రాంతాల్లో చూస్తే అది 97.9గా ఉంది.
ఇంటర్నెట్ వినియోగంలో దేశంలోని 28 రాష్ట్రాలు, తొమ్మిది కేంద్ర పాలిత ప్రాంతాలలో వ్యత్యాసాలు ఉన్నాయి. మానవాభివృద్ధి సూచీలో వెనుకబడి ఉన్న బిహార్, ఉత్తర్‌ప్రదేశ్, ఒడిశా లాంటి రాష్ట్రాలలో ఇంటర్నెట్ వినియోగదారుల సాంద్రత కూడా అత్యంత తక్కువగా ఉంది.
ఇంటర్నెట్ సదుపాయాల లభ్యతపై భౌగోళిక పరిస్థితుల ప్రభావం కూడా ఉంటుంది.
ఉదాహరణకు, హిమాచల్ ప్రదేశ్‌లోని మారుమూల పర్వత ప్రాంతాల్లో, రాజస్థాన్‌లోని అత్యంత తక్కువ జనాభా ఉండే ఎడారి ప్రాంతాల్లో, మధ్యప్రదేశ్‌లోని దట్టమైన అడవుల్లో ఇంటర్నెట్ సదుపాయం కల్పించడం కష్టంగా మారుతోంది.
ఈ మారుమూల ప్రాంతాల్లో చాలావరకు గిరిజనులు, అట్టడుగు వర్గాల ప్రజలే నివాసం ఉంటున్నారు.
ఇంటర్నెట్ వినియోగంలో పురుషులకు, మహిళలకు మధ్య కూడా వ్యత్యాసం చాలా ఉంది. 16 శాతం మంది భారతీయ మహిళలు మాత్రమే మొబైల్, ఇంటర్నెట్ సేవలను ఉపయోగిస్తున్నారని మొబైల్ ఆపరేటర్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న జీఎస్‌ఎంఏ విడుదల చేసిన 2019 నివేదిక వెల్లడించింది.
మొత్తంగా చూస్తే, పురుషుల కంటే 56 శాతం తక్కువ మంది మహిళలు ఇంటర్నెట్ వాడుతున్నారు.
డేటా ఛార్జీలు భారీగా తగ్గాయి కానీ, ఇప్పటికీ ఇంటర్నెట్ సదుపాయం కలిగిన ఫోన్లను కొనలేని స్థితిలో చాలా కుటుంబాలు ఉన్నాయి.
ఆర్థిక విషయాలలో పురుషుల మీద ఆధారపడటం లాంటి కారణాలతో చాలామంది మహిళలు అలాంటి ఫోన్లను కొనలేకపోతున్నారు. ఫోన్లు కొనడంతో పాటు, మహిళల్లో అక్షరాస్యత రేటు, డిజిటిల్ టెక్నాలజీపై సరైన అవగాహన లేకపోవడం కూడా వారు ఇంటర్నెట్ వాడకపోవడానికి కారణాలు. ఇలాంటి కారణాల వల్లే వృద్ధుల్లో చాలామంది ఇంటర్నెట్ వాడలేకపోతున్నారు.
డిజిటల్ సాధికారత సమాజంలో విస్తృత అవగాహనను, స్వతంత్రతను పెంచుతుంది. కాబట్టి, తమ సామాజిక కట్టుబాట్లకు అది ముప్పుగా మారుతుందని కొంతమంది భావిస్తున్నట్లు కూడా అనిపిస్తోంది.
కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు, ముఖ్యంగా యువతులు మొబైల్ ఫోన్లు, సోషల్ మీడియా వాడకుండా స్థానిక సంఘాలు నిషేధం విధించడం లాంటి ఘటనలకు సంబంధించిన కథనాలు అందుకు నిదర్శనం.
విద్యావంతుల్లో చూసినా, గ్లోబల్ టెక్నాలజీ ట్రెండ్స్‌కు ప్రతిబింబంగా నిలుస్తున్న భారత్‌లో ఇప్పటికీ పురుషుల ఆధిపత్యమే కొనసాగుతోంది.
ఈ వ్యత్యాసాలను తగ్గించేందుకు భారత ప్రభుత్వం కృషి చేస్తోంది.
అందుకోసం కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల్లో అందరికీ మొబైల్ ఇంటర్నెట్‌ను అందుబాటులోకి తేవాలన్న లక్ష్యంతో ప్రారంభించిన డిజిటల్ ఇండియా ప్రాజెక్టు ప్రధానమైనది.
ఆ కార్యక్రమంలో భాగంగా, దేశంలోని 2,50,000 గ్రామాలకు బ్రాడ్‌బ్యాండ్ సదుపాయం కల్పించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. 2011లో ఈ ప్రాజెక్టు ప్రారంభమైతే, నిర్ధేశించుకున్న లక్ష్యంలో ఇప్పటి వరకు సగం కూడా సాధించలేదు.
బ్రాడ్‌బ్యాండ్ సదుపాయం కల్పించిన చాలా ప్రాంతాల్లో ఇంటర్నెట్ వేగం చాలా తక్కువగా ఉంది.
డిజిటల్ ఇండియా లక్ష్యాలను చేరుకునేందుకు మరింత పటిష్టమైన కార్యాచరణ అవసరమని ప్రభుత్వ జాతీయ డిజిటల్ కమ్యూనికేషన్స్ విధానం కూడా గుర్తించింది.
ఇంటర్నెట్ సదుపాయం లేని ప్రాంతాలతో పాటు, ఇప్పటికీ ఇంటర్నెట్‌కు దూరంగా ఉంటున్న వెనుకబడిన వర్గాలకు, మహిళలకు, దివ్యాంగులకు మొబైల్ ఇంటర్నెట్‌ను అందుబాటులోకి తేవాల్సిన అవసరం ఉందని ఆ విధానం పేర్కొంది.
గ్రామీణ, పట్టణ ప్రాంతాలన్న తేడా లేకుండా అంతటా ఇంటర్నెట్ అనుసంధానంలో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించాలని, అవసరమైన చోట పబ్లిక్ వైఫై ఏర్పాటు చేయాలని సూచించింది.
ఈ విషయాలపై ప్రభుత్వం దృష్టి సారించి, ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయి? ఎందుకు ఆ సమస్యలు ఎదురవుతున్నాయి? అన్న విషయాలను విశ్లేషించుకుని ముందడుగు వేసినప్పుడే, దేశంలో డిజిటల్ విభజనకు పరిష్కారం దొరుకుతుంది.

Axact

Axact

Vestibulum bibendum felis sit amet dolor auctor molestie. In dignissim eget nibh id dapibus. Fusce et suscipit orci. Aliquam sit amet urna lorem. Duis eu imperdiet nunc, non imperdiet libero.

Post A Comment:

0 comments: