తెలుగు సంవత్సరాలు అరవై అని అందరికీ తెలుసు. ప్రభవనామ సంవత్సరంతో మొదలైన ఈ పేర్లు అక్షయ వరకూ ఉంటాయి. అసలు ఈ పేర్లు ఎలా వచ్చాయి? కేవలం అరవై మాత్రమే ఉండటానికి కారణం ఏంటి? పురాణగాథ ఏం చెబుతోంది?
ఇదీ పురాణ గాథ!
ఒకానొక సమయంలో నారద మునీంద్రుడు తానంత గొప్ప భక్తుడు లేడని, తానొక గొప్ప త్యాగిని, సన్యాసిని అనుకొని ఆ గర్వంతో విర్ర వీగుతున్నాడట. అప్పుడు  శ్రీమహా విష్ణుడు అతడికి జ్ఞాన బోధ చేయాలని తలంచాడు. దీంతో నారదుడిని మాయ ఆవరించేలా చేసి ఒక సరస్సు తీసుకెళ్లి అందులో దిగి స్నానం చేయమన్నాడు. నారదుడు అందులో దిగి స్నానం చేయగానే, ఒక్కసారి పూర్వ స్మృతిని మర్చిపోయి, స్త్రీ రూపం ఎత్తాడు. అదే సమయంలో దారితప్పి అక్కడకు వచ్చిన ఓ మహారాజును చూసి మోహించి, వివాహం చేసుకుని 60మంది పిల్లలను కన్నాడు. వారే.. ప్రభవ.. విభవ.. శుక్ల.. చివరిగా అక్షయ. వారంతా ఒకరి తర్వాత ఒకరు యుద్ధంలో మరణిస్తుండటంతో పుత్రశోకంతో ఉండిపోయాడు. సంసార సాగరంలో మునిగిపోయి అసలు తానెవరో మర్చిపోయాడు. అప్పుడు నారదుడిని ఆవరించిన మాయను శ్రీహరి తొలగించి, ఇదీ సంసారం అంటే.. నీవు ఏదో గొప్ప భక్తుడవని భావిస్తున్నావు. అని జ్ఞానబోధ చేశాడట. నీ పిల్లలు 60 సంవత్సరాలుగా కాలచక్రంలో తిరుగుతుంటారు అని విష్ణుమూర్తి వరమిస్తాడు. అవే మన తెలుగు సంవత్సరాలుగా ప్రస్తుతం వాడుకలో ఉన్నాయి.
ఇక ధర్మశాస్త్రం ప్రకారం చూసుకుంటే
మనం సౌరమానంలో జీవిస్తున్నాం. ఏదైనా బిందువును 360 డిగ్రీల కోణంలో మనం చూడవచ్చు. అదే మనిషి కేంద్రం అయినా వర్తిస్తుంది. మనిషి ముందువైపు 180 డిగ్రీలు ఉంటే, వెనుకవైపు మరో 180 డిగ్రీలు ఉంటుంది. అంటే వెనుక ఉన్న గతం 180.. ముందు ఉన్న వర్తమాన, భవిష్యత్‌లు మరో 180డిగ్రీలు. కృత, త్రేతా, ద్వాపర యుగాల్లో మానవ ఆయుర్దాయం 180 సంవత్సరాలు. కలియుగానికి వచ్చే సరికి కలి ప్రభావంతో 120 సంవత్సరాలకు పడిపోయింది. అందుకే 60ఏళ్లు పూర్తవగానే షష్టి పూర్తి చేస్తారు. అంటే దీనర్థం. మొదటి 60ఏళ్లు పూర్తవగానే లోక సంబంధ విషయాలు పూర్తయినట్లు భావించాలి. మిగిలిన 60ఏళ్లు ఆధ్యాత్మిక చింతనతో బతకాలని ధర్మశాస్త్రం చెబుతోంది.
ఇక జ్యోతిష్య శాస్త్రం ప్రకారం తీసుకుంటే, ద్విశతోత్తరి దశ అనే ప్రమాణంలో 120 సంవత్సరాలుగా సూచిస్తోంది.
ఇలా రవి 6 సంవత్సరాలు, చంద్రుడు 10 సంవత్సరాలు.. ఇలా నవగ్రహాలు మన ఆయుర్థాయాన్ని పంచుకుంటే 120ఏళ్లు బతకాలి.
అరవై సంవత్సరాలకు ఒకసారి మానవుడి మనో ధర్మాలతో పాటు, మానవ ధర్మాల విషయంలో మార్పులు సంభవిస్తాయి. మానవుడి బుద్ధి శక్తి కూడా 60ఏళ్లు నిరాటంకంగా పనిచేస్తుంది. అక్కడి నుంచి మానవ శరీరంలో మార్పులు మొదలువుతాయి. క్రమంగా జ్ఞాపకశక్తి క్షీణిస్తూ వస్తుంది. శరీరంలోని కండరాలు కరిగిపోతుంటాయి. అరవై సంవత్సరాలలోపు మృత్యుశక్తి ఒకసారి ప్రభావం చూపుతుందని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతారు. అంటే ఏదో విధమైన ప్రాణాపాయం దగ్గరి వరకూ వచ్చి వెళ్తుందన్నమాట. అరవై సంవత్సరాల నుంచి ప్రతి పదేళ్లకు మృత్యుశక్తి పలకరిస్తూ ఉంటుంది.
ప్రభవ నామ సంవత్సరంతో ప్రారంభమైన తెలుగు సంవత్సరాలు అక్షయతో ముగుస్తాయి. అంటే మనిషి పుట్టిన సంవత్సరం నుంచి తిరిగి అరవై ఏళ్ల తర్వాత అదే సంవత్సరం మొదలువుతుంది. అప్పటి నుంచి మళ్లీ బాల్యావస్థ మొదలవుతుంది. అంటే చిన్న పిల్లల్లా ప్రవర్తిస్తుంటారు. అకారణంగా అలగడం, అవీ.. ఇవీ తినాలని అడగటం, చిన్న చిన్న దొంగతనాలు చేయటం, ఎక్కువసేపు నిద్రపోవటం, చిన్న విషయాలకే ఆనంద పడటం, కోపం తెచ్చుకోవటం, కన్నీళ్లు పెట్టుకోవడం ఇలాంటి బాల్య చేష్టలన్నీ అరవైఏళ్ల నుంచి నెమ్మదిగా ప్రారంభమవుతాయి. ప్రతి కొడుకూ అరవై సంవత్సరాలు వచ్చిన నాటి నుంచి తన తండ్రిని తన బిడ్డలతో సమానంగా చూసుకోవాలని ధర్మశాస్త్రం చెబుతోంది.  ఆరుపదుల జీవితాన్ని ఎవరైతే ఆనందంగా జీవిస్తారో వారి జీవితం ధన్యం. ఆ ధన్యజీవితపు జ్ఞాపకార్థమే బిడ్డలు, మనవళ్లు బంధువులు మిత్రులు కలిసి ‘షష్టిపూర్తి చేస్తారు’
మన తెలుగు సంవత్సరాల పేర్లు
1. ప్రభవ, 2. విభవ, 3. శుక్ల, 4. ప్రమోదూత, 5. ప్రజోత్పత్తి, 6. ఆంగీరస, 7. శ్రీముఖ, 8. భవ, 9. యువ, 10. ధాత, 11. ఈశ్వర, 12. బహుధాన్య, 13. ప్రమాధి, 14. విక్రయ, 15. వృక్ష, 16. చిత్రభాను, 17. స్వభాను, 18. తారణ, 19. పార్థివ, 20. వ్యయ, 21. సర్వజిత్, 22. సర్వధారి, 23. విరోధి, 24. వికృతి, 25. ఖర, 26. నందన, 27. విజయ, 28. జయ, 29. మన్మథ, 30. దుర్ముఖి, 31. హేవలంబి, 32. విలంబి, 33. వికారి, 34. శార్వరి, 35. ప్లవ, 36. శుభకృతు, 37. శోభకృతు, 38. క్రోధి, 39. విశ్వావసు, 40. పరాభవ, 41. ప్లవంగ, 42. కీలక, 43. సౌమ్య, 44. సాధారణ, 45. విరోధికృతు, 46. పరీధావి, 47. ప్రమాదీచ, 48. ఆనంద, 49. రాక్షస, 50. నల, 51. పింగళ, 52. కాళయుక్త, 53. సిద్ధార్థి, 54. రౌద్రి, 55. దుర్మతి, 56. దుందుబి, 57. రుధిరోద్గారి, 58. రక్తాక్షి, 59. క్రోధన, 60. అక్షయ.

Axact

Axact

Vestibulum bibendum felis sit amet dolor auctor molestie. In dignissim eget nibh id dapibus. Fusce et suscipit orci. Aliquam sit amet urna lorem. Duis eu imperdiet nunc, non imperdiet libero.

Post A Comment:

0 comments: