ఆభరణాల కోసమే కాకుండా పెట్టుబడుల కోసం బంగారానికి ప్రాధాన్యం గణనీయంగా పెరుగుతోంది. బంగారాన్ని ఎప్పుడంటే అప్పుడు నగదులోకి మార్చుకోవచ్చు. భద్రత ఎక్కువ ఉంటుంది. పెరుగుతున్న ద్రవ్యోల్భణాన్ని ఎదుర్కొనే సామర్థ్యం కూడా ఉంటుంది. అత్యవసర సమయాల్లో ఆదుకొనడంలో బంగారం ముందుంటుంది. అందుకే బంగారాన్ని కొనుగోలు చేసే విషయంలో సందేహాలు ఉండవు. దీన్ని విభిన్న రూపాల్లో కొనుగోలు చేసే అవకాశం ఉంది. కాబట్టి ఆర్ధిక సామర్థ్యం ను బట్టి చేయవచ్చు.
1
ఇలా కొనొచ్చు...
* బంగారాన్ని కాయిన్ల రూపంలో, ఆభరణాలుగా, కడ్డీలుగా కొనుగోలు చేయవచ్చు.
వీటిని భౌతిక బంగారంగా చెప్పుకోవచ్చు. వీటిని ఆభరణాల దుకాణాల్లో కొనుగోలు చేయవచ్చు.
* అంతేకాకుండా గోల్డ్ ఎక్స్చేంజి ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్), సావరిన్ గోల్డ్ బాండ్స్ రూపంలోనూ బంగారాన్ని కొనుగోలు చేయవచ్చు. గోల్డ్ ఈటీఎఫ్ లను స్టాక్ మార్కెట్ ఎక్స్చేంజి ల ద్వారా, సవరిన్ గోల్డ్ బాండ్లను బ్యాంకులు, పోస్టాఫీసులు, ఇతర అధీకృత ఆర్ధిక సంస్థల ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఈ బంగారాన్ని పేపర్ గోల్డ్ గా వ్యవహరిస్తారు.
* కొన్ని ఈ-కామర్స్ వెబ్ సైట్లు కూడా బంగారాన్ని విక్రయిస్తున్నాయి. నాణ్యతను బట్టి బంగారం ధర ఆధారపడి ఉంటుంది. మేలిమి బంగారం 24 క్యారెట్లు ఉంటుంది.
2
దేని ప్రయోజనం దానిదే..
* బంగారం కొనుగోలు చేయాలనగానే ఆభరణాలు గుర్తుకు వస్తాయి చాలా మందికి . కొంత మందికి బార్లు కొనుగోలు చేయడం ఆసక్తికరంగా ఉంటుంది. తమ హోదాను తెలియజేసేందుకు చాలామంది ఆభరణాలు కొనుగోలు చేస్తారు. అయితే ఇలాంటి ఆభరణాలు, లేదా కడ్డీల వల్ల కొంత సమస్య కూడా ఉంటుంది.
* వీటిని దాచి పెట్టడం కొంత ఇబ్బందితో కూడిన వ్యవహారం. కాబట్టి బ్యాంకు లాకర్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం కొంత ఖర్చు చేయాల్స ఉంటుంది. ఆభరణాల కోసం మేకింగ్ చార్జీలు చెల్లించాలి. పన్నులు కూడా చెల్లించాల్సి వస్తుంది.
* పేపర్ బండారం అయితే ఇలాంటి వ్యయాలు ఉండవు. వీటిని అమ్ముకున్నప్పుడు అప్పుడు ఉన్న ధర చేతికి వస్తుంది. ఆభరణాల మాదిరిగా తరుగు ఉండదు. ఒకవేళ పన్ను చెల్లించాల్సి వచ్చినా అది తక్కువగానే ఉంటుంది.
* బంగారాన్ని తనఖా పెట్టి తీసుకోవచ్చు. బంగారం బాండ్లపై కూడా రుణం పొందవచ్చు. వీటిని మరొకరికి కూడా సులభంగా బదిలీ చేయవచ్చు.
3
ఎంత పెట్టుబడి పెట్టాలంటే...
* బంగారంలో ఎంత పెట్టుబడి పెట్టాలన్నది మీ సంపాదనను బట్టి ఆధారపడి ఉంటుంది. మీరు విభిన్న రకాల ఆస్తుల్లో పెట్టుబడులు పెడుతుంటే అందులో అయిదు శాతం బంగారంలో పెట్టుబడి పెట్టవచ్చని మార్కెట్ విశ్లేషకులు సూచిస్తుంటారు. అయితే ఎక్కువ సంపాదన ఉంటె ఈ మొత్తాన్ని పెంచుకోవచ్చు. పూర్వం పెద్దలు తమ వద్ద డబ్బు ఉన్నప్పుడు ఎంతో కొంత బంగారాన్ని కొనుగోలు చేసేవారు. అది పండగలు, పెళ్లిళ్ల సందర్బంగా ఉపయోగపడేది. నేటి తరం యువత బంగారం బాండ్లు, ఈటీఎఫ్ లు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. బంగారం ధర పెరిగే కొద్దీ గోల్డ్ ఈటీఎఫ్ ల ధర పెరుగుతుంది. బంగారం బాండ్లపై స్థిరమైన వడ్డీ రేటు లభిస్తుంది. ప్రస్తుతం సావరిన్ గోల్డ్ బాండ్లపై 2.5 వడ్డీ రేటును ఇస్తున్నారు.
* బంగారు ఆభరణాలు లేదా కడ్డీలను కొనుగోలు చేయాలనుకున్నప్పుడు నమ్మకం ఉన్న సంస్థ వద్ద కొనుగోలు చేయడం మంచిది. బంగారానికి సంబందించిన నాణ్యతను కూడా చూసుకోవాలి. బంగారం నాణ్యతను నిర్ధారించే హాల్ మార్కింగ్ ఉన్నది లేనిదీ చేసుకోవాలి.
Post A Comment:
0 comments: