చెట్టంత మనిషిని పక్షవాతం నిట్టనిలువునా కూల్చేస్తుంది. సమయానికి చికిత్స అందకపోతే మంచానికే పరిమితం చేయొచ్చు. అందువల్ల పక్షవాతం వచ్చాక బాధపడేకన్నా అది రాకుండా చూసుకోవటమే మేలు. ఇందుకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. వీటిల్లో చాలావరకు మనకు సాధ్యమైనవే కావటం మన అదృష్టం.
రక్తపోటు అదుపు
అధిక రక్తపోటుతో పక్షవాతం ముప్పు పెరుగుతుంది. అందువల్ల రక్తపోటు 120/80 మించకుండా చూసుకోవాలి. ఒకవేళ ఎక్కువుంటే ఆహార, వ్యాయామ నియమాలతో తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. అప్పటికీ అదుపులోకి రాకపోతే మందులు వేసుకోవాలి.
గుండెలయను కనిపెట్టండి
గుండెలయ అస్తవ్యస్తమయ్యే సమస్య(ఏట్రియల్‌ ఫిబ్రిలేషన్‌)తో పక్షవాతం వచ్చే అవకాశం 5 రెట్లు ఎక్కువ. ఒకవేళ గుండె వేగంగా, అస్తవ్యస్తంగా కొట్టుకుంటుంటే డాక్టర్‌ను సంప్రదించి కారణమేంటో తెలుసుకోవటం మంచిది. ఒకవేళ ఏట్రియల్‌ ఫిబ్రిలేషన్‌ సమస్య ఉన్నట్టయితే గుండె వేగాన్ని, రక్తం గడ్డలు ఏర్పడటాన్ని తగ్గించే మందులు సూచిస్తారు.
ఒత్తిడికి కళ్లెం
ఒత్తిడి మూలంగా ఒంట్లో వాపు ప్రక్రియ (ఇన్‌ఫ్లమేషన్‌) తలెత్తుతుంది. ఇది పక్షవాతం ముప్పు పెరగటానికి దోహదం చేస్తుంది. కాబట్టి ఒత్తిడిని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. తీరికలేని పనులతో ఆఫీసులో ఒత్తిడికి గురవుతుంటే మధ్యమధ్యలో కుర్చీలోంచి లేచి కాసేపు పచార్లు చేయండి. గాఢంగా శ్వాస తీసుకోండి. ఒకేసారి బోలెడన్ని పనులు ముందేసుకోకుండా ఒక పని పూర్తయ్యాక మరో పని ఆరంభించండి. పని చేసే వాతావరణం ప్రశాంతంగా ఉంచుకోవటం ఉత్తమం. వీలైతే చిన్న చిన్న మొక్కలు పెంచుకోవచ్చు. ఆఫీసు పనులను ఇంటిదాకా తెచ్చుకోకుండా కుటుంబ సభ్యులతో హాయిగా గడపటం అలవాటు చేసుకోండి.
మధుమేహం నియంత్రణ
మధుమేహంతో బాధపడేవారికి పక్షవాతం ముప్పు 1.5 రెట్లు ఎక్కువ. దీనికి ప్రధాన కారణం గ్లూకోజు స్థాయులు అధికంగా ఉండటం వల్ల రక్తనాళాలు, నాడులు దెబ్బతినటం. అంతేకాదు, మధుమేహంతో బాధపడేవారికి గుండెజబ్బు, పక్షవాతం ముప్పులు పెరగటానికి దోహదం చేసే అధిక రక్తపోటు, ఊబకాయం కూడా ఎక్కువగానే ఉంటుంటాయి. కాబట్టి గ్లూకోజును నియంత్రణలో ఉంచుకోవటం అత్యవసరం.
మందులు తప్పొద్దు
అధిక రక్తపోటు, మధుమేహం వంటి సమస్యలేవైనా ఉంటే క్రమం తప్పకుండా మందులు వేసుకోవటం తప్పనిసరి. మధ్యలో మానెయ్యటం తగదు. తమకు తోచినట్టుగా మందుల మోతాదులు తగ్గించుకోవటమూ సరికాదు.
అధిక బరువు తగ్గాలి
అధిక బరువు, ఊబకాయంతో మధుమేహం, రక్తపోటు ముప్పులు పెరుగుతాయి. ఫలితంగా పక్షవాతం ముప్పూ ఎక్కువవుతుంది. 5 కిలోల బరువు తగ్గినా మంచి ఫలితం కనిపిస్తుంది. క్రమం తప్పకుండా రోజూ కనీసం అరగంట సేపు వ్యాయామం చేయటం అన్ని విధాలా మంచిది.
పీచు పెంచండి
రోజూ పొట్టు తీయని ధాన్యాలు, తాజా కూరగాయలు, పండ్లు విధిగా తీసుకోవాలి. ఎందుకంటే వీటిలోని పీచు ఎంతో మేలు చేస్తుంది. రోజుకు మనకు 25 గ్రాముల పీచు అవసరం. ప్రతి 7% అధిక పీచుతో పక్షవాతం ముప్పు 7% తగ్గుతుంది.
పొగ మానెయ్యాలి
సిగరెట్లు, బీడీలు, చుట్టల వంటివి కాల్చేవారికి రక్తం గడ్డలు, రక్తనాళాలు సన్నబడటం, రక్తనాళాల్లో పూడికలు ఏర్పడే ప్రమాదముంది. ఇవన్నీ పక్షవాతం ముప్పు పెరిగేలా చేసేవే.
చెడ్డ కొలెస్ట్రాల్‌తో జాగ్రత్త
చెడ్డ (ఎల్‌డీఎల్‌) కొలెస్ట్రాల్‌ ఎక్కువగా.. మంచి (హెచ్‌డీఎల్‌) కొలెస్ట్రాల్‌ తక్కువగా ఉంటే రక్తనాళాల్లో పూడికలు ఏర్పడే ముప్పు పెరుగుతుంది. మెదడుకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాల్లో ఇవి ఏర్పడితే పక్షవాతానికి దారితీయొచ్చు. సంతృప్త కొవ్వు పదార్థాలు తగ్గించుకోవటం ద్వారా చెడ్డ కొలెస్ట్రాల్‌ పెరగకుండా చూసుకోవచ్చు. వ్యాయామం చేయటం ద్వారా మంచి కొలెస్ట్రాల్‌ మోతాదులు పెంచుకోవచ్చు. వీటితో ప్రయోజం కనిపించకపోతే మందులు తీసుకోవచ్చు.

Axact

Axact

Vestibulum bibendum felis sit amet dolor auctor molestie. In dignissim eget nibh id dapibus. Fusce et suscipit orci. Aliquam sit amet urna lorem. Duis eu imperdiet nunc, non imperdiet libero.

Post A Comment:

0 comments: