సంక్షోభంలో కూరుకు పోయిన ఆటోమొబైల్ పరిశ్రమ ఇప్పట్లో కోలుకునేలా కనిపించడం లేదు. వరసగా 11వ నెల కూడా ఆటోమొబైల్ అమ్మకాలు క్షీణించాయి. సెప్టెంబర్ నెలలో ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు 23.69 శాతం క్షీణించాయి. ఈ నెలలో కేవలం 2,23,317 యూనిట్లు మాత్రమే అమ్ముడు పోయాయి. 2018సెప్టెంబర్ నెలలో 2,92,660 యూనిట్ల ప్రయాణికుల వాహనాలు అమ్ముడుపోయాయి. సెప్టెంబర్ నెల వాహన విక్రయాల గణాంకాలను సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్(సియామ్) శుక్రవారం విడుదల చేసింది. దేశీయ కార్ల అమ్మకాల్లో 33.4 శాతం క్షీణత నమోదైంది. గత ఏడాది సెప్టెంబర్‌లో 1,97,124యూనిట్ల ప్యాసింజర్ కార్ల అమ్మకాలు జరగ్గా ఈ ఏడాది అదే నెలలో 1,31,281 యూనిట్లకు పరిమితమైంది.
ఇక మోటారు సైకిళ్ల అమ్మకాలు 23.29 శాతం తగ్గి 10,43,624 యూనిట్లకు పరిమితమైనాయి. మరో వైపు ద్విచక్ర వాహనాల అమ్మకాలు 22.09 శాతం, కమర్షియల్ వాహనాల అమ్మకాలు 39.06 శాతం తగ్గాయి. అన్ని కేటగిరీలకు కలిపి మొత్తంగా సెప్టెంబర్ నెలలో 20,04,932 యూనిట్ల వాహనాలు అమ్ముడు పోయాయి. 2018 సెప్టెంబర్ నెలలో విక్రయించిన 25,84,062 యూనిట్లతో పోలిస్తే ఇది 22.41 శాతం తక్కువ అని సియామ్ పేర్కొంది.సంక్షోభంనుంచి బయలపడేందుకు, కొనుగోలుదారులను ఆకర్షించేందుకు ఆటోమొబైల్ కంపెనీలు అనేక రకాలుగా ప్రయత్నిస్తున్నాయి.
Post A Comment:
0 comments: