మొబైల్ సర్వీస్ ప్రొవైడర్లు తమకు బకాయిపడిన సుంకాలు, ఫీజుల మొత్తం రూ. 92,000 కోట్లు చెల్లించాలన్న టెలికమ్యూనికేషన్ల శాఖ అభ్యర్థనను సుప్రీంకోర్టు సమర్థించింది.
భారత సర్వోన్నత న్యాయస్థానం ఈ మేరకు ఇచ్చిన ఆదేశాల ప్రభావం మొబైల్ సర్వీస్ ప్రొవైడర్లలో రెండు సంస్థలపై భారీగా పడనుంది. ఈ నిర్ణయంపై భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా సంస్థలు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నాయి. ఈ నిర్ణయం తరువాత రెండు సంస్థల షేర్ల ధరలపైనా ప్రభావం పడింది. గురువారం భారతీ ఎయిర్‌టెల్ షేర్ల ధర 9.7 శాతం, వొడాఫోన్ ఐడియా షేర్ల ధర 23 శాతం పతనమైంది.
అయితే, ట్రేడింగ్ ముగిసే సమయానికి భారతీ ఎయిర్‌టెల్ షేర్ ధర కోలుకుని 3 శాతం అధికంతో ముగిసింది.
వొడాఫోన్ ఐడియా ప్రభుత్వానికి రూ.28,300 కోట్ల లైసెన్సు ఫీజు బకాయి పడగా ఆ సంస్థ వద్ద నగదు నిల్వలు రూ.21 వేల కోట్లే ఉన్నాయి.
మరోవైపు భారతీ ఎయిర్‌టెల్ రూ.21,600 కోట్ల మేర సుంకాలు బకాయిపడింది.
ఏజీఆర్‌పై వివాదం
మొబైల్ సర్వీస్ ప్రొవైడర్లు చెల్లించాల్సిన మొత్తాలు వాటి 'అడ్జస్టెడ్ గ్రాస్ రెవెన్యూ' (ఏజీఆర్)తో ముడిపడి ఉంటాయి. భారత్‌లో టెలికాం సంస్థలు తమ ఏజీఆర్‌లో 3 నుంచి 5 శాతం యూజర్ చార్జీలుగా.. 8 శాతం మొత్తాన్ని లైసెన్స్ ఫీజుగా చెల్లిస్తాయి.
అయితే, ఏజీఆర్‌ను ఎలా నిర్వచిస్తారనే అంశంపై భారత్‌లో మొబైల్ సర్వీస్ ప్రొవైడర్లు, ప్రభుత్వం మధ్య దశాబ్ద కాలంగా వివాదం నడుస్తోంది.
అన్ని మార్గాల్లో సాధించిన ఆదాయాన్ని ఏజీఆర్‌గా పరిగణించాలని టెలికాం డిపార్ట్‌మెంట్ అంటుండగా.. కేవలం ప్రధాన సేవలనే (కోర్ సర్వీసెస్) ప్రాతిపదికగా తీసుకుని ఏజీఆర్ లెక్కించాలని మొబైల్ సర్వీస్ ప్రొవైడర్లు కోరుతున్నారు.
మూలిగే నక్కపై తాటిపండే’
కాగా ఈ నిర్ణయం వల్ల మొబైల్ సేవల రంగంపై పెను ప్రభావం పడుతుందని భారతీ ఎయిర్‌టెల్ హెచ్చరించింది. 'మొబైల్ సేవల రంగం ఆర్థికంగా తీవ్ర కష్టాల్లో ఉన్నప్పుడు ఇలాంటి నిర్ణయం వల్ల మరింత నష్టం కలుగుతుంది.. మొబైల్ సేవల రంగం పూర్తిగా బలహీనపడుతుంది. దీనికి బదులు ఇప్పటికే కష్టాల్లో ఉన్న ఈ రంగంలోని సంస్థలపై ఆర్థిక భారాన్ని తగ్గించే మార్గాలు ఆలోచించాలి'' అని భారతీ ఎయిర్‌టెల్ ఒక ప్రకటనలో పేర్కొంది.
వొడాఫోన్ సంస్థా ఈ విషయంలో ఇలాగే ఆందోళన వ్యక్తంచేసింది. 'ఇప్పటికే పలు సంస్థలు ఈ రంగం నుంచి తప్పుకొన్నాయి. ఇలాంటి తరుణంలో భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియాలపైనా భారం మోపుతూ తీసుకున్న నిర్ణయం తీవ్ర ప్రభావం చూపుతుంది'' అని ఆ సంస్థ పేర్కొంది.
ఆర్థిక అంశాల నిపుణుడు వివేక్ కౌల్ దీనిపై మాట్లాడుతూ ''ఈ నిర్ణయం రెండు కంపెనీలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. వాళ్లు ఈ మొత్తాలు చెల్లించడానికి అప్పులు చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది. స్టాక్ మార్కెట్లో నిధులు పోగు చేయడం ఈ పరిస్థితుల్లో సులభం కాదు కాబట్టి ప్రధాన వాటాదారులే నిధులు సమకూర్చుకోవాలి. ఇది వినియోగదారులపైనా ప్రభావం చూపించొచ్చు'' అన్నారు.
జియోకు ఇబ్బంది లేనట్లేనా?
కాగా ఈ నిర్ణయం ప్రభావం 'జియో' మాతృసంస్థ రిలయన్స్‌పై పెద్దగా పడకపోవచ్చు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రభావం రిలయన్స్ ఇండస్ట్రీస్‌పై పెద్దగా ఉండదన్న విశ్లేషకుల అంచనాలతో గురువారం ఆ సంస్థ షేర్ల ధరలు పెరిగాయి. జియో సేవలు 2016 నుంచి ప్రారంభం కావడంతో పోటీ సంస్థలతో పోల్చినప్పుడు రిలయన్స్‌కు బకాయిల భారం భారీగా లేదు.
మరోవైపు వచ్చే ఏడాది నుంచి 5జీ సేవలను అందుబాటులోకి తేవాలన్న ప్రయత్నాలపైనా ఈ నిర్ణయ ప్రభావం ఉండొచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ ప్రభావం వల్ల సర్వీస్ ప్రొవైడర్ల వద్ద నిధులు తగ్గిపోతాయని.. నిధులే లేనప్పుడు 5జీ బిడ్డింగ్‌‌కు వెళ్లేదెవరని విశ్లేషకులు అంటున్నారు.

Axact

Axact

Vestibulum bibendum felis sit amet dolor auctor molestie. In dignissim eget nibh id dapibus. Fusce et suscipit orci. Aliquam sit amet urna lorem. Duis eu imperdiet nunc, non imperdiet libero.

Post A Comment:

0 comments: