సృజనాత్మకత.. పట్టుదల.. జన్మభూమి మీద ప్రేమ.. ఇవన్నీ కలిస్తే వ్యాపార దిగ్గజం రతన్‌ టాటా రూపం వస్తుంది.  సవాళ్లను స్వీకరించడం.. విజయం సాధించడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. నష్టాల్లో ఉన్న ఎన్నో సంస్థలు ఆయన సారథ్యంలో లాభాల బాటపట్టాయి. ఇదంతా ఒక ఎత్తయితే.. ఆయన దేశభక్తి మరో ఎత్తు. వ్యాపారాల నుంచి వచ్చే లాభాల్లో సింహభాగాన్ని  దాతృత్వ కార్యక్రమాలకే వెచ్చిస్తారు. వ్యక్తిగత ప్రచారానికి దూరంగా ఉంటారు. వ్యాపార దిగ్గజం రతన్‌టాటా జీవిత విశేషాలు..
చిన్నప్పుడే తల్లిదండ్రులకు దూరమై..
రతన్‌ నావల్‌ టాటా 1937లో సూరత్‌లోని పారిశ్రామికవేత్తల కుటుంబంలో జన్మించారు. ఆయన  తండ్రి నావల్‌ టాటా, తల్లి సూని టాటా. రతన్‌ ఏడేళ్ల వయస్సులో తల్లిదండ్రులు విడిపోయారు. ఆయన తండ్రి నావల్‌ను చిన్నప్పుడే టాటా గ్రూప్‌ వ్యవస్థాపకుడు జంషెట్‌జీ టాటా దత్తత తీసుకొన్నారు. తల్లిదండ్రులు విడిపోయాక అమ్మమ్మ నవాజీబాయ్‌ టాటా వద్ద రతన్‌ పెరిగారు.
ఐబీఎం ఆఫర్‌ వదులుకొని..
రతన్‌ అమెరికాలోని కార్నెల్‌ విశ్వవిద్యాలయం నుంచి బీఎస్‌ ఆర్కిటెక్చర్‌ చేశారు. అప్పట్లో ఆయనకు ఐబీఎం సంస్థ నుంచి ఆఫర్‌ ఇచ్చింది. కానీ, ఆయన భారత్‌ తిరిగి వచ్చేసి టాటా గ్రూప్‌లో చేరారు. ఆయనకు గ్రూపులో తొలిసారి జంషెడ్‌పూర్‌లోని టాటాస్టీల్‌ బాధ్యతలు అప్పగించారు. ఆ తర్వాత 1971లో నేషనల్‌ రేడియో అండ్‌ ఎలక్ట్రానిక్స్‌కు డైరెక్టర్‌గా నియమించారు. అప్పటికే ఆ సంస్థ తీవ్ర నష్టాల్లో ఉంది. మార్కెట్‌ షేరు 2శాతం, నష్టాలు 40శాతంగా ఉన్నాయి. కానీ రతన్‌ ఆ కంపెనీ జాతకాన్నే మార్చేశారు. ఫలితంగా ఆ కంపెనీ మార్కెట్లో 25 శాతం వాటా దక్కించుకొని లాభాల్లోకి దూసుకెళ్లింది. ఆయన హార్వర్డు బిజినెస్‌ స్కూల్‌ నుంచి అడ్వాన్స్‌డ్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సును పూర్తి చేశారు.
టాటా గ్రూప్‌ బాధ్యతలు చేపట్టి..
1981లో టాటా గ్రూప్‌ అధిపతి జేఆర్‌డీ టాటా రతన్‌కు కీలక బాధ్యతలు అప్పగించారు. టాటా గ్రూప్‌ వారసుడిగా రతన్‌ పేరును ప్రకటించారు. చాలా జూనియర్‌ అయిన రతన్‌కు బాధ్యతలు అప్పగించడంపై అప్పట్లో చాలా మంది పెదవి విరిచారు. రతన్‌ పగ్గాలు చేపట్టిన పదేళ్లలోనే కంపెనీని భారీగా విస్తరింపజేశారు. ఆయన బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి పదవీ విరమణ చేసే నాటికి టాటా గ్రూప్‌ లాభాలు 50 రెట్లు పెరిగాయంటే ఆయన ఏ స్థాయిలో వ్యాపారాన్ని విస్తరించారో అర్థమవుతుంది.
కంపెనీల కొనుగోళ్లకు వెనుదీయకుండా..
రతన వ్యాపార పగ్గాలు చేపట్టినప్పటి నుంచి నష్టాల్లో ఉన్న కంపెనీలను లాభాల్లోకి తీసుకురావడం అలవాటైపోయింది. ఈ క్రమంలో ఆయన టెట్లీ, కోరస్‌ స్టీల్‌, జాగ్వార్‌, ల్యాండ్‌ రోవర్‌ వంటి ప్రతిష్ఠాత్మక కంపెనీలను టాటాగూటికి చేర్చారు. టాటాగ్రూప్‌లో అత్యధిక ఆదాయం ఎగుమతుల నుంచే లభిస్తోందంటే వారి ఉత్పత్తుల నాణ్యతను అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం టాటా గ్రూపునకు చెందిన కంపెనీలు 100కుపైగా దేశాల్లో విస్తరించాయి. వీటిలో టీసీఎస్‌ భారత్‌కు కలికితురాయి వంటిది. 2012లో ఆయన టాటాగ్రూప్‌ ఛైర్మన్‌ బాధ్యతల నుంచి తప్పుకొని సైరస్‌ మిస్త్రీకి అప్పగించారు. కానీ, కొన్ని కారణాలతో 2016లో మళ్లీ బాధ్యతలు చేపట్టారు. 2017లో ఎన్‌.చంద్రశేఖరన్‌కు బాధ్యతలు అప్పగించి తప్పుకొన్నారు.
జేఎల్‌ఆర్‌ కథ..
1998లో టాటాలు ప్యాసింజర్ కార్ల విభాగంలోకి ప్రవేశించారు. తొలుత ఇండికా కారును మార్కెట్లోకి తీసుకొచ్చారు. తొలినాళ్లలో ఈ కారు మార్కెట్‌ను ఆకట్టుకోలేదు. దీంతో రతన్‌ తన ప్యాసింజర్‌ కార్ల వ్యాపారాన్ని ఫోర్డుకు విక్రయించేద్దామనుకొన్నారు. ఈ డీల్‌కోసం అమెరికాలోని డెట్రాయిట్‌లో ఫోర్డు బృందంతో 3గంటలు చర్చలు జరిపారు. ఆ సమయంలో ఫోర్డు ప్రతినిధుల ప్రవర్తనకు రతన్‌ కొంచెం నొచ్చుకున్నారు. దీంతో భారత్‌ తిరిగి వచ్చేసి ప్యాసింజర్‌ కార్ల వ్యాపారాన్ని కొనసాగించాలని నిర్ణయించుకొన్నారు. ఆ తర్వాత స్వల్ప మార్పులతో ఇండికా మార్కెట్లో విజయవంతమైంది. ఇక టాటాలు వెనక్కి తిరిగి చూడలేదు. సఫారీ, సుమో వాహనాలు కూడా మార్కెట్లో టాటాలను నిలబెట్టాయి. మరోపక్క జాగ్వర్‌ ల్యాండ్‌రోవర్‌ను కొన్న ఫోర్డు వాటిని నిర్వహించలేక 2008లో రతన్‌ నేతృత్వంలోని టాటా గ్రూపుకే విక్రయించింది.
సామాన్యుడి కలలను నిజం చేయాలనే..
రతన్‌ టాటా నిరాడంబరంగా జీవిస్తారు. ఆయన లాభాల్లో 65శాతం టాటా ట్రస్ట్‌లకే కేటాయించి దాతృత్వాన్ని చాటుకొన్నారు. ఆయన విమానాల్లో బిజినెస్‌ క్లాస్‌లో ప్రయాణిస్తారు. కొన్నేళ్ల క్రితం విజయవాడ వచ్చిన రతన్‌ సాధారణ ప్రయాణికుడి వలే కారులో ప్రయాణిస్తూ ట్రాఫిక్‌లో చిక్కుకున్నారు. చుట్టుపక్కల జనం కారులో ఉంది రతన్‌ టాటా అని తెలిసి ఆశ్చర్యపోయారు. మధ్యతరగతి కుటుంబాలు కూడా కారును సొంతం చేసుకునేలా ధరలు ఉండాలని రతన్‌ భావించారు. రూ.లక్షకే కారు అందజేస్తామని రతన్‌ ప్రకటించారు. దీనిపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. 2008లో ఈ కారు మార్కెట్లోకి వచ్చింది. కానీ, ఆ తర్వాత వినియోగదారులను అంతగా ఆకట్టుకోలేదు. 2018లో ఈ కారు ఉత్పత్తి దాదాపు నిలిచిపోయింది. మొదట్లో వచ్చిన అవకాశాలు తాము అంతగా వినియోగించుకోలేకపోయామని రతన్‌ అంగీకరిస్తారు. కానీ, మధ్యతరగతి కుటుంబానికి ఒక కారును అందజేయాలనే ఆయన ఆశయం ప్రజల మనసుల్లో నిలిచిపోయింది.
భారత్‌ వంటి దేశాల్లో అందరికీ స్వచ్ఛమైన తాగునీరు అందాలని రతన్‌ భావించారు. దీంతో టీసీఎస్‌, టాటా కెమికల్స్‌, టైటాన్‌ గ్రూపులను ఆదేశించి రెండు అత్యంత చౌక అయిన వాటర్‌ ప్యూరిఫైయర్లను తయారు చేయించారు. 2009లో వీటిని విడుదల చేశారు. వీటి ధర రూ.1000 లోపు ఉండటం విశేషం.
దేశభక్తి విషయంలో రాజీలేదు..
రతన్‌ టాటా దేశభక్తి విషయంలో రాజీపడరు. 26\11న ఉగ్రవాదులు ముంబయిలోని హోటల్‌ తాజ్‌పై దాడి చేశారు. పలువురి ప్రాణాలు తీశారు. ఈ ఘటనలో తాజ్‌ హోటల్‌ కూడా బాగా దెబ్బతింది. దీనిని తిరిగి బాగుచేయించేందుకు టాటాల చరిత్రలోనే అతిపెద్ద టెండర్‌ను పిలవాలని రతన్‌ నిర్ణయించారు. దీనిలో పాల్గొనేందుకు ఇద్దరు పాక్‌ పారిశ్రామిక వేత్తలు ముంబయిలోని టాటాహౌస్‌కు వచ్చారు. అక్కడ వారికి రతన్‌ అపాయింట్‌మెంట్‌ దొరకలేదు. ఆ తర్వాత వారు దిల్లీ వెళ్లి అక్కడి నుంచి ఫోన్‌ చేయించారు. ఫోన్‌చేసిన పెద్దమనిషిపై రతన్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి ఫోన్‌పెట్టేశారు. టాటా సుమోల కోసం పాకిస్థాన్‌ ప్రభుత్వం పెట్టిన ఆర్డర్‌ను కూడా రతన్‌ వదులుకున్నారు. ఆ దేశానికి వాహనాలను ఎగుమతి చేయలేదు.
ఎఫ్‌16లో ప్రయాణించిన వ్యాపారవేత్త..
రతన్‌ టాటాకు పైలట్‌ లైసెన్స్‌ ఉంది. ఆయన తరచూ విమానాలను నడుపుతుంటారు. రతన్‌కు సొంతంగా ఫాల్కన్‌ 200 జెట్‌ ఉంది. ఆయన 2007లో ఎఫ్‌16 ఫైటింగ్‌ ఫాల్కన్‌ యుద్ధవిమానాన్ని నడిపారు. లాక్‌హీడ్‌ మార్టిన్‌ తయారు చేసిన ఈ లోహవిహంగం ప్రపంచంలోనే అత్యుత్తమ యుద్ధవిమానాల్లో ఒకటిగా నిలచింది. రతన్‌కు కార్‌డ్రైవింగ్‌ అంటే చాలా ఇష్టం. ఆయన తన ఎరుపు రంగు ఫెరారీ కాలిఫోర్నియాలో తరచూ షికారు చేస్తుంటారు. ఆయన వద్ద హోండా సివిక్‌, ల్యాండ్‌ రోవర్‌ ఫ్రీ ల్యాండర్‌, మాసెర్టి క్వాట్రోపోర్టు, కాడిలాక్‌ ఎక్స్‌ఎల్‌ఆర్‌, బెంజ్‌ 500 ఎస్‌ఎల్‌, ఎస్‌క్లాస్‌, క్రిస్లర్‌సెబ్లింగ్‌, జాగ్వర్‌ ఎఫ్‌టైప్‌, బ్యూక్‌ సూపర్‌ 8 వంటి కార్లు ఉన్నాయి. మరో విషయం ఏంటంటే రతన్‌ టాటాకు ఎరుపు రంగు అంటే విపరీతమైన ఇష్టం. ఒక సందర్భంలో ఆర్ట్‌ గ్యాలరీని సందర్శించిన రతన్‌ అక్కడ ఉన్న ఎరుపు రంగు చిత్రాలు మొత్తం కొనుగోలు చేస్తానని చెప్పారు.
నాలుగు సార్లు పెళ్లి వరకూ వచ్చి..
రతన్‌ టాటా పెళ్లి చేసుకోలేదు. ఆయన వ్యక్తిగత విషయాలను బయట ప్రస్తావించరు. కానీ, సీఎన్‌ఎన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రతన్‌ తన పెళ్లి విషయాన్ని వెల్లడించారు. నాలుగుసార్లు పెళ్లివరకూ వచ్చి  వివిధ భయాలతో నిలిచిపోయాయని పేర్కొన్నారు. ఒక్కోసారి ఒక్కో ప్రత్యేక కారణం ఉందని చెప్పారు.
యువతను ప్రోత్సహించడంలో ముందు..
రతన్‌ టాటా కంపెనీ బాధ్యతల నుంచి వైదొలగినా ఆయనకు వ్యాపారంపై ఆసక్తి తగ్గలేదు. తన వక్తిగత సంపదను వివిధ స్టార్టప్‌ల్లో పెట్టుబడిగా పెడుతూ యువతను ప్రోత్సహిస్తున్నారు. డగ్‌స్పాట్‌ , నెస్టవే, టైగర్‌ ఎలక్ట్రికల్‌ వెహికల్స్‌ వంటి సంస్థలు వీటిల్లో ఉన్నాయి. ఆయన దాదాపు 30కి పైగా అంకుర సంస్థల్లో పెట్టుబడి పెట్టారు.
రతన్‌పై అవార్డుల జల్లు..
రతన్‌ టాటాను దేశంలోని అత్యున్నత అవార్డుల్లో ఒకటైన పద్మవిభూషణ్‌ 2008లో వరించింది. అంతకు ముందే 2000లో ఆయనకు పద్మభూషణ్‌ లభించింది. ఇక యూకే ప్రభుత్వం గౌరవ నైట్‌ హుడ్‌ను ఆయనకు బహూకరించింది. స్వాతంత్ర్యం వచ్చాక ఈ అవార్డు అందుకొన్న తొలి భారతీయుడు రతన్‌ టాటానే. ఆయనకు వచ్చిన డాక్టరేట్ల జాబితా చాలా పెద్దది. వ్యాపార రంగాన్ని కూడా సామాజిక బాధ్యత కోణంలో చూసే అరుదైన పారిశ్రామిక వేత్త రతన్‌టాటా.

Axact

Axact

Vestibulum bibendum felis sit amet dolor auctor molestie. In dignissim eget nibh id dapibus. Fusce et suscipit orci. Aliquam sit amet urna lorem. Duis eu imperdiet nunc, non imperdiet libero.

Post A Comment:

0 comments: