జపాన్‌లోని ఓ స్కూల్‌ తరగతి గది అది. స్కూలు వదిలేసే సమయం.. విద్యార్థులంతా సంచుల్లో పుస్తకాలు సర్దుకుని ఇంటికి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారు.
ఏడు గంటల పాటు సుదీర్ఘంగా పాఠాలు విన్నాక ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్తామా అని వారంతా ఎదురుచూస్తున్నారు.
మరుసటి రోజు చేయాల్సిన పనికి సంబంధించి టీచర్ ముఖ్యమైన విషయం చెబుతుండడంతో వారంతా శ్రద్ధగా వింటున్నారు.
ఆ విషయం చెప్పడం పూర్తయ్యాక టీచర్, ''సరే... ఈ రోజు మొదటి రెండు వరుసల్లో ఉన్నవారు క్లాస్ రూం శుభ్రం చేయాలి. మూడు, నాలుగు వరుసల విద్యార్థులు కారిడార్, మెట్లు శుభ్రం చేయాలి. అయిదు, ఆరు వరుసలవారు టాయిలెట్లు శుభ్రం చేస్తారు' అని ప్రకటించారు.
టాయిలెట్లు శుభ్రం చేయాల్సిన అయిదారు వరుసల విద్యార్థుల నుంచి నిట్టూర్పులు వినిపించాయి కానీ, అవేమీ బిగ్గరగా లేవు. అంతా క్షణాల్లో సైనికుల్లా చురుగ్గా కదులుతూ ఎవరికి అప్పగించిన పనులను వారు చకచకా చేసేశారు.
ఆ స్కూలే కాదు ఆ దేశంలోని అన్ని స్కూళ్లలోనూ ఇదే పద్ధతి పాటిస్తారు.
జపాన్‌ను తొలిసారి సందర్శించేవారు ఈ దేశం ఇంత శుభ్రంగా ఉందేమిటి అని నోరెళ్లబెట్టి చూస్తూ ఉండిపోతారు. రోడ్ల పక్కన చెత్తకుండీలు కానీ, రోడ్లూ ఊడ్చేవారు కానీ లేని విషయం గుర్తిస్తారు. 'ఇవేమీ లేకుండానే ఇంత శుభ్రంగా ఉందేమిటి?'' అనుకుంటారు.
కొద్దిసేపటికి వారికి సమాధానం దొరుకుతుంది. ప్రజలే ఎవరికి వారు పరిసరాలను శుభ్రంగా ఉంచుకుంటున్నారని అర్థం చేసుకుంటారు.
హిరోషిమాలోని ప్రెఫెక్చురల్ గవర్నమెంట్ టోక్యో కార్యాలయ అసిస్టెంట్ డైరెక్టర్ మైకో అవానీ తమ దేశం ఎందుకు శుభ్రంగా ఉంటుందో చెబుతూ ''ప్రాథమిక విద్య నుంచి ఉన్నత విద్య వరకు పన్నెండేళ్ల స్కూలు జీవితంలో ప్రతిరోజూ పారిశుద్ధ్యానికి సమయం కేటాయిస్తార''ని అన్నారు. ''వస్తువులు, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాల్సిన అవసరాన్ని ఇంట్లో కూడా నిత్యం చెబుతుంటారు. అందుకే చిన్నతనం నుంచి ఆ లక్షణం అలవడుతుంది'' అని అన్నారాయన.
స్కూళ్ల పాఠ్యపుస్తకాలలోనే సామాజిక స్పృహను అలవాటు చేసే అధ్యాయాలుంటాయి.
స్కూలుకి రాగానే విద్యార్థులు తమ బూట్లను విప్పేసి వాటికి కేటాయించిన ప్రదేశంలో ఉంచుతారు. ఇంటికి వెళ్లగానే కూడా బయటే చెప్పులు, షూస్ వదిలి లోపలికి వెళ్తారు. ఏదైనా పని చేయడానికి ఇతరుల ఇళ్లకు వెళ్లేవారు కూడా షూస్ బయటే వదిలివెళ్తారు.
ఫ్రీలాన్స్ అనువాదకుడు చికా హయాషి తన స్కూలు రోజులు గుర్తుచేసుకుంటూ "నేను కొన్నిసార్లు పాఠశాలను శుభ్రపరచడానికి ఇష్టపడేవాడిని కాను. కానీ, అది మా దినచర్యలో భాగం కావడంతో కాదనకుండా చేసేవాడిని. అలా స్కూలును శుభ్రం చేసుకోవడం చాలా మంచి విషయం. మన వస్తువులను, మనం తిరిగే ప్రదేశాలను మనమే శుభ్రంగా ఉంచుకోవడం అవసరం కదా'' అన్నారు.
పాఠశాల స్థాయి నుంచే విద్యార్థుల్లో శుభ్రతాస్పృహ నరనరాన జీర్ణించుకోవడం వల్ల వారు పెరిగి పెద్దయ్యాక కూడా అదే పద్ధతులు పాటిస్తూ పరిశుభ్రతకు ప్రాధాన్యమిస్తారు.
జపాన్‌లో శుభ్రతకు ఎంత ప్రాధాన్యమిస్తారు? ఎంత త్వరత్వరగా చేస్తారనే విషయాల్లో కొన్ని ఉదాహరణలు ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయిన సందర్భాలున్నాయి. అక్కడి రైళ్లను ఏడు నిమిషాల్లోనే శుభ్రం చేయడానికి వినియోగించే పద్ధతులకు సంబంధించిన వీడియోలు ఆన్‌లైన్‌లో కనిపిస్తాయి.
జపాన్ ఫుట్‌బాల్ జట్టు కూడా ప్రపంచకప్ ఫుట్‌బాల్ టోర్నీలు జరిగినప్పుడు మైదానంలోని చెత్తను శుభ్రం చేయడానికి సిద్ధం కావడం, వారు తమ గదులను వదిలి వెళ్లినప్పుడు శుభ్రం చేయడం వంటివన్నీ అందరినీ ఆశ్చర్యపరిచాయి. 'జపాన్ జట్టు అందరికీ ఆదర్శం' అంటూ ఫిఫా జనరల్ కోఆర్డినేటర్ ప్రిసిలా జాన్సెన్స్ ట్వీట్ కూడా చేశారు.
ప్రతిరోజూ ఉదయాన్నే 8 గంటలకు ఆఫీసుల్లో పనిచేసేవారు, దుకాణదారులు తమ పరిసరాలను శుభ్రం చేస్తారు. ప్రతి నెలా కొందరు చిన్నారులు కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి తాముండే ప్రాంతాన్ని శుభ్రం చేసే బాధ్యతను తీసుకుంటారు.
నోట్లు తళతళలాడుతుంటాయి..
జపాన్‌లో కరెన్సీ నోట్లు తళతళలాడుతుంటాయి. కారణం వాటిని ఎవరూ మురికిపట్టేలా వాడరు. దుకాణాలు, హోటళ్లు, టాక్సీల్లో డబ్బు చేతులు మారదు. డబ్బు అందుకోవడానికి ఒక ట్రే ఉంటుంది. అందులో ఉంచుతారు.
జలుబు, దగ్గు, ఇతర ఇన్ఫెక్షన్లతో ఎవరైనా బాధపడితే వారు మాస్క్‌లు ధరిస్తారు. ఇతరులకు ఆ వైరస్, బ్యాక్టీరియా సోకకుండా చూడడం తమ బాధ్యతగా భావిస్తారు.
తరతరాలుగా అదే శుభ్రత
జపనీయుల శుభ్రతా స్పృహ ఈనాటిది కాదని చరిత్ర చెబుతోంది. జపాన్‌లో అడుగుపెట్టిన తొలి ఆంగ్లేయుడు విల్ ఆడమ్స్ తన జీవిత చరిత్రలోనూ ఈ విషయం ప్రస్తావించారు. 1600 సంవత్సరంలో జపాన్‌లో అడుగుపెట్టిన ఆయన అనంతరం తన జీవిత చరిత్రలో 'జపాన్ ప్రభువులు చాలా శుభ్రంగా ఉన్నార'ని పేర్కొన్నారు. ఐరోపాలో పరిశుభ్రత అనేదే లేని ఆ కాలంలోనే జపనీయులు శుభ్రతకు ప్రాధాన్యమిచ్చేవారు.
జపాన్‌ వాతావరణం వేడిగా ఉండడమే కాకుండా ఆర్థ్రతా ఎక్కువ. అలాంటి వాతావరణంలో ఆహారం తొందరగా పాడవుతుంది. పరిశుభ్రంగా లేకపోతే ఇంకా తొందరగా పాడవుతుంది. కాబట్టి జపనీయులు ఆహారం, పరిసరాలు అన్నీ శుభ్రంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటారు.
బౌద్ధం కూడా కారణమే...
ఆరు, ఎనిమిది శతాబ్దాల మధ్య చైనా, కొరియాల నుంచి జపాన్‌లో ప్రవేశించిన బౌద్ధ మతం కూడా అక్కడి ప్రజల పరిశుభ్రతా స్పృహకు ఒక కారణంగా చెప్పొచ్చు. బౌద్ధంలో శుభ్రతకు అత్యంత ప్రాధాన్యమిస్తారు. శుభ్రపరచడం, వంట చేయడం వంటివన్నీ కూడా ఆధ్యాత్మిక కసరత్తులగానే భావిస్తారు బౌద్ధంలో. దాన్ని ధ్యానంతో సమానంగా చూస్తారు.
అన్ని బౌద్ధ దేశాలూ జపాన్‌లా శుభ్రంగా లేవెందుకు?
బౌద్ధం మతాచరణ ఎక్కువగా ఉన్న దేశాలన్నీ జపాన్‌లా శుభ్రంగా ఉంటాయన్న గ్యారంటీ లేదు. జపాన్ వాటికంటే భిన్నంగా ఉండడానికి కారణం ఉంది. బౌద్ధ మతం జపాన్‌లోకి రావడానికి ముందే అక్కడ షింటో(దేవతా పథం) అనే మతం ఉంది. అందులో జపనీయుల ప్రత్యేక గుర్తింపు అనేది ఆత్మగా మలచుకోవాలని ఆ మతం చెబుతుంది. అంతేకాదు.. ఆ మతంలో శుభ్రత గుండెకాయలాంటిది. కాబట్టి అప్పటికే పరిశుభ్రతకు ప్రాణమిచ్చే జపనీయులను బౌద్ధం మరింతగా శుభ్రతవైపు అడుగులు వేయించింది. అదే శుభ్రత విషయంలో జపాన్‌ను, మిగతా దేశాలకంటే ప్రత్యేకంగా నిలిపింది.

Axact

Axact

Vestibulum bibendum felis sit amet dolor auctor molestie. In dignissim eget nibh id dapibus. Fusce et suscipit orci. Aliquam sit amet urna lorem. Duis eu imperdiet nunc, non imperdiet libero.

Post A Comment:

0 comments: